- మావో కీలక నేతలు కూచన్‌పెల్లి వాసులు
- ఒకరు ఎన్కౌంటర్.. మరొకరు లొంగుబాటు
ఉద్యమాలకు ఊపిరులు ఊదిన నిర్మల్ గడ్డ అలసిపోయింది. నాటి నైజాం, ఆంగ్లేయుల పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమరుల త్యాగాలు చరిత్ర పుటల్లో నిలిచాయి. రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకులు ఈ ప్రాంతం వారే. మావోయిస్టుల ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకులు నిర్మల్ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. దీంతో సామాజిక, రాజకీయ, ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిర్మల్ జిల్లా నిలిచింది. నాటి పోరాటాలకు సజీవ సాక్షాలు నేటికీ నిర్మల్ ప్రాంతంలో చరిత్రను గుర్తుచేస్తున్నాయి. వేయి ఉర్ల మర్రి, గడీలు, కోటలు, చైన్‌గేట్ తదితర ప్రాచీన కట్టడాలు నాటి ఈ ప్రాంత వైభవానికి సజీవ సాక్షాలుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమాల పురిటిగడ్డ అలసిపోయింది. కొందరు మావో ఉద్యమకారులు ఎన్కౌంటర్‌లో మృత్యువాత పడగా మరికొందరు లొంగిపోవడంతో ఈ ప్రాంతంలో ఉద్యమం మరుగున పడుతోంది.
ఉద్దండులిద్దరూ ఒక్కూరి వారే
మావోయిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్దండులు నిర్మల్ జిల్లా వాసులు కావడంతో ఈ ప్రాంతానికి ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మావోయిస్టు చరిత్రలోనే నిలిచిపోయిన కీలక నాయకులు ఇద్దరు ఒక్కూరి వారే కావడం గమనార్హం. లక్ష్మణచాంద మండలం (ప్రస్తుత సోన్ మండలం) కూచన్‌పెల్లి గ్రామానికి చెందిన (ప్రస్తుతం లొంగి పోయిన) మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఎర్రి మోహన్ రెడ్డి, ఎన్కౌంటర్‌లో మృతిచెందిన అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి వరగంటి పండరి ఎలియస్ సూర్యం ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. 1960లో జన్మించిన మోహన్ రెడ్డి 1978లో ఉద్యమంలో చేరి 47 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటం అనంతరం ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు. 1966లో జన్మించిన వరగంటి పండరి 1985లో ఉద్యమంలో చేరి 2000 సంవత్సరంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడం వల్ల మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఉద్దండలిద్దరూ ఒకే ఊరికి చెందిన వారని పలువురు చర్చించుకుంటున్నారు.
