- మూడు మున్సిపాలిటీలు.. ముగ్గురు ఎమ్మెల్యేలు
- నిర్మల్ జిల్లాలో ప్రతిష్టాత్మక మునిసిపాలిటీలు
Nirmal Dist Municipal Elections: నిర్మల్ జిల్లాలో మున్సిపల్ పోరు వేడెక్కుతోంది.. ఆశావహుల అలకలు.. రాజీనామాలు.. మంతనాలు.. నజరానాలతో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది.. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పట్టణాల్లో పురపోరు వేడి పుట్టిస్తోంది..
ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం
నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మూడు మున్సిపాలిటీలు ముగ్గురు శాసనసభ్యులకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. నిర్మల్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మహేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, నిర్మల్ మున్సిపాలిటీలో ఏవిధంగానైనా విజయ దుందుభి మోగించాలని పావులు కదుపుతున్నారు. ముథోల్ ఎమ్మెల్యేగా భారతీయ జనతాపార్టీ నుంచి రామారావు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని భైంసా మున్సిపాలిటీపై కాశాయ జెండా ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి వెడమ బొజ్జు ఉన్నారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ చేజారి పోకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. బల్దియాను హస్తగతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మూడు మున్సిపాలిటీలు ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఏ విధంగానైనా మూడు మున్సిపాలిటీలలో విజయం సాధించాలని ముగ్గురు శాసనసభ్యులు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. ఎవరి పంతం నెగ్గుతుందో వేచి చూడాలి మరి..
