Purchase of grain
Purchase of grain

Purchase of grain: ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు: అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్

  • 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా
  • కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన
  • టోకెన్ పద్ధతి ప్రకారం ధాన్యం తీసుకుని రావాలి
  • ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో రివ్యూ

Purchase of grain: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 20 (మన బలగం): జిల్లాలో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25 లో పండిన నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ తన చాంబర్‌లో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25 ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. వరి కోతల వివరాలు, గన్ని సంచుల లభ్యత, వరి సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య, పంట దిగుబడి, వాటిని ఏ రైస్ మిల్లులకు పంపుట మొదలగు వివరాలను కొనుగోలు కేంద్రాల వారిగా అదనపు కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనా ఉందని, వీటి కొనుగోలుకు అవసరమైన కొనుగోలు కేంద్రాల తుది జాబితా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ మాసం ఎంత ధాన్యం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు వస్తుందో మండలాల వారిగా ముందస్తుగానే ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. హార్వెస్టర్లతో సమావేశం నిర్వహించి టోకెన్ పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో పంట కోతలు జరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత యాసంగి కొనుగోలు సీజన్‌లో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాలను తగ్గించి వాటి స్థానంలో ఐకేపీ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, టార్ఫాలిన్‌లు కొనుగోలు కేంద్రాలకు ఎన్ని అందిస్తున్నారు పూర్తి వివరాలు నివేదిక అందజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ యంత్రాలను పరీక్షించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే షెడ్యూల్ ప్రకారం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు దగ్గరే ధాన్యం నాణ్యతను కట్టుదిట్టంగా పరిశీలించాలని, రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు ఉండడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జి అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందజేయాలని తెలిపారు. సమావేశంలో డీఎం సివిల్ సప్లై అధికారి రజిత, డీసీఎస్‌వో వసంత లక్ష్మి, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *