Aadhaar Card: పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని, స్కూల్ సర్టిఫికెట్స్‌ను మాత్రమే ప్రూఫ్‌గా తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు ఆధారంగా పుట్టిన తేదీని ధ్రువీకరించలేమని పేర్కొంది. పదో తరగతి ధ్రువీకరణ ప్రతాలను మాత్రమే అందుకు ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. ఓ కేసు విషయంలో సుప్రీం కోర్టు దీనిపై స్పష్టతను ఇచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి పరిహారం చెల్లించేందుకు వయస్సు నిర్ధారించేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని పంజాబ్ – హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. జువైనల్ జస్టిస్ పిల్లల సంరక్షణ చట్టం 2015లోని సెక్షన్ 94 ప్రకారం స్కూల్ సర్టిఫికెట్‌లో వెల్లడించిన పుట్టిన తేదీనే ఆధారంగా చేసుకొని వయస్సును నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది.
దీని ప్రకారంగానే మరణించిన వారి వయస్సు నిర్ణయించాలని జస్టిస్ సంజయ్ కరోల్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వయస్సు నిర్ధారణకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకోవద్దని వెల్లడించింది. హక్కుదారు-అప్పిలెంట్ల వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. స్కూల్ సర్టిఫికెట్ ప్రకారం మరణించిన వయస్సు లెక్కించిన మోటారు యాక్సిటెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) నిర్ణయాన్ని సమర్థించింది. ఆధార్ కార్డు ప్రకారం మృతుని వయస్సు 47 సంవత్సరాలుగా నిర్ధారించారు. పాఠశాల ధ్రువీకరణ పత్రాల ప్రకారం అతని వయస్సు లెక్కిస్తే, అతను మరణించే సమయానిక 45 ఏళ్లుగా ఉంది. దీంతో ఆధార్ కార్డు ఆధారంగా మరణించిన వ్యక్తి వయస్సు నిర్ణయించారు. ఈ విషయంలో హైకోర్టు పొరపాటు చేసిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.