review of tourism development
review of tourism development

review of tourism development: పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు.. నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

review of tourism development: నిర్మల్, అక్టోబర్ 24 (మన బలగం): పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటకరంగ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యాటకరంగా అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి అవసరమైన సౌకర్యాలు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి హిస్టారికల్, టూరిజం అధికారుల సమన్వయంతో జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రాజెక్టులు, జలపాతాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. బాసర సరస్వతి దేవి, అడెల్లి పోచమ్మ, సదర్‌మాట్ బ్యారేజ్, స్వర్ణ, కడెం, గడ్డెన్న వాగు ప్రాజెక్టులను సందర్శించే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా స్థాయి టూరిజం కమిటీని ఏర్పాటు చేసి, పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పర్యాటక ప్రదేశాలపై ఫొటో, డాక్యుమెంటరీ పోటీలను నిర్వహించాలని, మేధావులు, విద్యావంతులు, ప్రముఖులతో సంప్రదించి పర్యాటకారంగం అభివృద్ధికి వారి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. జిల్లా పర్యాటక ప్రాంతాలకు విస్తృతంగా ప్రచారం కల్పించడం కోసం ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజికమధ్యమ సాధనాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. పర్యాటక కేంద్రాల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం, మరుగుదొడ్లను నిర్వహించాలన్నారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

అనంతరం బాసర సరస్వతి ఆలయ అభివృద్ధిపై కలెక్టర్ అధికారులతో చర్చిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాసర దేవాలయంలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యం మెరుగ్గా ఉండాలన్నారు. ప్రత్యేక రోజుల్లో రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆలయ పరిసరాల్లో నిరంతర పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులను మెరుగుపరచాలని సూచించారు. గోదావరి నది వద్ద భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు నది లోపలికి వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర సమయాల్లో భక్తులు సంప్రదించేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, పర్యాటక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, సీపీఓ జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, బాసర ఆలయ ఈవో విజయరామారావు, ఈడియం నదీమ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *