Police Open House: నిర్మల్, అక్టోబర్ 24 (మన బలగం): పోలీసుల విధులు, ఆయుధాల వినియోగం, చట్టాలు తదితర అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోనీ నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు డీఎస్పీ గంగా రెడ్డి నేతృత్వంలో గురువారం ఏర్పాటు చేసిన ఒపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రిన్స్ హైస్కూల్, విజయ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు పాలొన్నారు. అందులో భాగంగా విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆయుధాలు, బాంబు డిస్పోజల్ సామగ్రి, పోలీస్ జాగిలాల ప్రదర్శనతోపాటు వాటి వినియోగం గురించి వివరించారు. షి టీమ్, ట్రాఫిక్, సైబర్ క్రైమ్, ఆంటీ నార్కోటిక్ డ్రగ్ విభాగాల పని తీరుపై అవగాహన కల్పించారు.
పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, అత్యవసర సమయాల్లో విద్యార్థులు వినియోగించాల్సిన డయల్ 100 గురించి వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గంగా రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖ పనితీరుపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. 100 డైల్ కాల్ వ్యవస్థ మానిటరింగ్ పోలీస్ కంట్రోల్ రూం నుంచి జరిగే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఒక్కో విభాగంలో సిబ్బంది చేసే విధులు, పోలీస్ స్టేషన్‌లకు అందించే కమ్యూనికేషన్ సిస్టమ్ పనితీరు గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ గంగా రెడ్డితో పాటు నిర్మల్ గ్రామీణ ఇన్‌స్పెక్టర్ రామ కృష్ణ, ఎస్ఐ లింబాద్రి, నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆయుధ నిపుణులు, పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.