Tummal Devrao: వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అందించే ధర్మనిధి పురస్కారాల ప్రదాన కార్యక్రమం తెలంగాణ సారస్వత పరిషత్‌లోని డాక్టర్ దేవులపల్లి రామానుజారావు కళామందిరంలో పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చరిత్రను వెలికి తీయడానికి విశేషంగా కృషిచేసిన డాక్టర్ తుమ్మల దేవారావుకు బి.ఎన్ శాస్త్రి ధర్మనిధి పురస్కారాన్ని ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్తలు తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్ జె.చెన్నయ్య, ఎల్లూరి శివారెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారంలో భాగంగా రూ.5 వేల నగదు, ప్రశంసా పత్రం శాలువా మెమొంటోతో సత్కరించారు.
నిర్మల్ జిల్లాకు చెందిన 17 శాసనాలను, వందలాది వినూత్నమైన విగ్రహాలను, బౌద్ధ, జైన ప్రతిమలను, బౌద్ధ స్తూపాలను, కోట్ల సంవత్సరాలకు చెందిన జంతు, వృక్ష శిలాజాలను తన పరిశోధనలో గుర్తించారని వక్తులు కొనియాడారు. డాక్టర్ తుమ్మల దేవరావ్ సాహితీరంగంలో అనేక పురస్కారాలు అందుకోవడం తోపాటు చారిత్రక పరిశోధనలో వారు అనేక అవార్డులు అందుకున్నారని వక్తలు ప్రశంసించారు. మట్టి గర్భంలో కూరుకుపోయిన వేల సంవత్సరాల చరిత్రను వెలుగులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు.
వేల సంవత్సరాలుగా ప్రజలు ఉపయోగించిన అనేక ప్రాచీనమైన వస్తువులను భద్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్మల్ ఉత్సవాల్లో వీటిని ప్రదర్శనకు ఉంచారు. నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపానికి కన్వినగర్‌గా వ్యవహరించి అనేక చారిత్రక వ్యాసాలను అందులో పొందుపరిచారు. కచ్చురం, గడ్డిపూలు, మట్టి పాదాలు, జంగిలి, నిర్మల్ జిల్లా కథలు, నిర్మల్ జిల్లా చరిత్ర వంటి రచనలు సాహితీ ప్రపంచంలో గుర్తింపు పొందాయి. చరిత్ర పరిశోధన విభాగంలో వీరికి బి.ఎన్.శాస్త్రి ధర్మనిధి పురస్కారం వరించింది.
గతంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్టమైన పరిశోధనలకు గాను కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చరిత్ర పరిశోధకుడిగా అవార్డును అందించింది. వీరి మట్టి పాదాలు సంకలనానికి ప్రతిష్టాత్మక సినారె పురస్కారం అందుకున్నారు. పలుమార్లు ఎక్స్ రే అవార్డు, రంజని కుందుర్తి అవార్డును అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో 70కి పైగా సాహితీ అవార్డులు వీరి సాహితీ కృషికి వరించాయి. తెలంగాణ సారస్వత పరిషత్ ధర్మనిధి పురస్కారం స్వీకరించినందుకు నిర్మల్ సాహితీ మిత్రులు డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ దామెర రాములు, నేరెళ్ల హనుమంతు, కామరపు జగదీశ్వర్ పత్తి శివప్రసాద్, అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, పోలీస్ భీమేశ్ తదితరులు అభినందించారు.
