- ప్రధాన కూడళ్లలో, అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు
- ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు
Road Safety: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్అండ్‌బీ రోడ్లు, పంచాయతీ రోడ్ల వద్ద ఉన్న, మున్సిపాలిటీ పరిధిలో గల ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించాలని, రోడ్లమీద వాహనాలు పార్కింగ్ చేయకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో, అప్రోచ్ రోడ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేనందున అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడానికి, పార్కింగ్ స్థలాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి సంబధిత అధికారులకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రస్తుతం రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్లపై అంతరాయం కలగకుండా పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని, పెద్దగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలని, ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో రేడియం సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని, దాని కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అంతర్గత ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్డు మరమ్మత్తు ప్రాంతాల్లో శ్రద్ధ వహించాలని, అవసరమైన చోట డివైడర్లు స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ కంట్రోల్ లైట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లాలో జంక్షన్ రోడ్ల వద్ద అవసరమైన స్పీడ్ బ్రేకర్, రంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని, సరుకు రవాణా వాహనాలు ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, జిల్లాలోని ప్రతి విద్యాసంస్థలో రోడ్డు భద్రత ప్రమాణాల పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రతి వారం ఒకరు చనిపోతున్నారని, దీని నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే తంగళ్ళపల్లి, తిప్పాపూర్ X రోడ్, గంభీరావుపేట్, కోనరావుపేట ముస్తాబాద్, చందుర్తి, బోయినపల్లి, కోదురుపాక జంక్షన్ వంటి 13 ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్ లకు గుర్తించి అక్కడ రోడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు సూచించే గోడ ప్రతులు, పోస్టర్లను ఆవిష్కరించినారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆర్ అండ్ బీ. ఈ.ఈ. వెంకట రమణయ్య, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్లు, లావణ్య, అన్వేష్, పి.అర్.ఈఈ సుదర్శన్ రెడ్డి , జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి పంచాక్షరి, ఆర్.టి.సి. డి.ఎంలు, నేషనల్ హైవేస్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.