రూ.60 వేలు కాజేసిన సైబర్ మోసగాళ్లు
Cyber Crime: జగిత్యాల, నవంబర్ 1 (మన బలగం): సైబర్ మోసగాళ్లు ఓ అమాయకుడికి వల వేశారు. ఎస్బీఐ యాప్ లింక్‌ను పంపి అప్‌డేట్ చేసుకోవాలంటూ రూ.60 వేలు కాజేసిన సంఘటన ఇది. జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌కు నాలుగు రోజుల క్రితం ఎస్బీఐ యాప్‌ను సైబర్ మోసగాళ్లు పంపారు. ఆ తరువాత యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని బ్యాంక్ సిబ్బందిలా సూచిస్తూ లింక్‌ను ఓపెన్ చేయించి ఖాతాలో ఉన్న రూ.60 వేలు కాజేశారు. తీరా తేరుకున్న బాధితుడు తన ఖాతాలో ఉన్న నిల్వను చెక్ చేసుకోగా అందులోంచి రూ.60 వేలు మాయమైనట్లు గుర్తించి నేరుగా ఎస్బీఐ (పాత ఎస్బీహెచ్) బ్యాంకుకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. స్పందించిన బ్యాంక్ సిబ్బంది బాధితుడి అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు తెలిసింది. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అ బాధితుడికి బ్యాంక్ సిబ్బంది సూచించగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.