HARISH RAO vs REVANTH REDDY
HARISH RAO vs REVANTH REDDY

Harish Rao vs Revanth reddy: ‘రాజీ’డ్రామా!

  • తీరం దాటిన తుపాను
  • చిరుజల్లులతో సరి
  • నెలకొన్న ప్రశాంత వాతావరణం
  • సవాళ్లు.. ప్రతి సవాళ్లు
  • రూ.2 లక్షల రుణమాఫీపై
  • హీటెక్కించిన కామెంట్లు
  • ముగిసిన పొలిటికల్ గేమ్
  • ఊహించిందే జరిగిందంటూ గుసగుసలు

Harish Rao vs Revanth reddy: రూ.2 లక్షల రుణమాఫీపై హీటెక్కిన రాష్ర్ట ఎన్నికల వాతావరణం చల్లబడింది. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో ఏర్పడిన ‘అల’జడి తీరం దాటింది. కేవలం చిరుజల్లులు కురిసి ప్రశాంత వాతావరణం నెలకొన్నది. హై టెన్షన్ క్రియేట్ చేసిన పొలిటికల్ గేమ్ ఊహించినట్లుగానే క్లైమాక్స్ ఉందని గుసగుసలు వినిపించాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టు వేసారు. దీన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ అడ్వాంటేజ్‌గా మలుచుకుంది. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న హామీలు అమలుచేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని, ఇప్పుడు దేవేళ్లపై ఒట్టు వేయడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తారా అంటూ సవాల్ చేసారు. దీనికి స్పందించిన హరీశ్ రావు శుక్రవారం తాను అమరుల స్తూపం వద్దకు రాజీనామా లేఖతో వస్తానని, రేవంత్ సైతం రావాలని సవాల్ చేసారు. శుక్రవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీశ్ రావు అమరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అమరులకు నివాళులర్పించారు.

రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లే

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్‌ వద్దకు ముఖ్యమంత్రి రావాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో ఆయన హరీశ్‌ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్దకు వచ్చారు.

అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని చెప్పారు. అమలు చేయకపోతే రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలన్నారు. రాజీనామాకు ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లేనని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడమే తమ కర్తవ్యమని వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై తొలి సంతకం పెడతామని మోసగించారని చెప్పారు. ప్రజలను మోసం చేసినందుకుగాను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అంతకుముందు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాండ్లకు కాలం చెల్లిందని సీఎం రేవంత్‌ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదేనని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్‌ అని విమర్శించారు.

హరీశ్.. నీ సవాల్ స్వీకరించా..
హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి స్పందించారు. హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరవీరుల స్తూపాన్ని అడ్డం పెట్టుకున్నారని మండిపడ్డారు. మోసం చేయాలనుకున్న ప్రతి సారీ ఇలా అమరులు గుర్తొస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. హరీశ్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఆ తేదీ తరువాత సిద్దిపేటకు పట్టిన శని వదిలిపోతుందని హాట్ కామెంట్స్ చేసారు.

ఇన్ని రోజులుగా గుర్తుకురాని అమరవీరుల స్తూపం ఇప్పుడు గుర్తొచ్చారని విరుచుకుపడ్డారు. తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చాడని సెటైర్లు వేసారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని, రాజీనామా లేఖ రెడీ పెట్టుకోవాలని అన్నారు. రుణమాఫీ చేయలేకపోతే తాము అధికారంలో ఉండి ఎందుకన్నారు. రూ.30-40వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్‌ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా?’ అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *