మురుగునీటి శుద్ధి కేంద్రాలకు రూ.42 కోట్లు మంజూరు
బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Nirmal town development funds: నిధుల లేమితో నిర్మల్ పట్టణం అభివృద్ధిలో పడకేసింది. రెండేళ్లుగా నిధులు లేమితో నీరసపడిన నిర్మల్ పట్టణానికి ఊరట లభించినట్టయింది. పట్టణంలో ప్రధాన సమస్యలైన అంతర్గత రోడ్లు, డ్రైనేజీలతోపాటు అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రెండేళ్లుగా నిధులు మంజూరి లేకపోవడంతో పట్టణవాసులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. అనేకమార్లు ఎమ్మెల్యే వద్ద పట్టణ వాసులు తమ సమస్యలను మొరపెట్టుకున్నప్పటికీ నిధులు లేకపోవడంతో ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో కేంద్రం నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు విపరీతంగా నిర్మించారు. కానీ కేంద్ర నిధులు పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోరాదనే నిబంధన ఉండడం వల్ల పట్టణంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. చిన్న వర్షానికే చిత్తడవుతున్న నిర్మల్ పట్టణానికి ప్రస్తుతం మంజూరైన నిధులతో కొంత ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.
పట్టణ అభివృద్ధికి 15 కోట్లు
నిర్మల్ పట్టణ అభివృద్ధికి 15 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వినియోగించుకోవచ్చు. దీంతో కొత్తగా ఏర్పాటైన కాలనీలకు సమస్యల నుంచి కొంత విముక్తి లభించే అవకాశం ఉంది.
మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు
నిర్మల్ పట్టణంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) ఏర్పాటుకు 42 కోట్లు మంజూరు అయ్యాయి. పట్టణంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజ్‌ల నిర్మాణానికి, మరియు పలు అభివృద్ధి పనులకు ఈ నిధులు మంజూరు అయినట్లు బీజేఎల్‌పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దసరా అనంతరం పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.