A review on Sahakar Se Samriddhi: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లాలోని రైతుల సంఖ్యకు అనుగుణంగా నూతన పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ‘సహకార్ సే సమృద్ధి’పై కలెక్టరేట్‌లో జిల్లా కమిటీ సభ్యులతో మంగళవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డ్ డీడీఎం దిలీప్ పథకం గురించి వివరించారు. జిల్లాలో మొత్తం 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. నూతన పీఏసీఎస్‌లు రైతుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని సేవలు పీఏసీఎస్‌లలో రైతులకు మరింత మెరుగ్గా అందాలని ఆదేశించారు. డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ అధికారి రామకృష్ణ, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ రావు, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.