Survey of Indiramma houses: నిర్మల్, డిసెంబర్ 23 (మన బలగం): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల వారీగా ప్రజావాణి కార్యక్రమమంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలి
జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు మూడు పూటలా కామన్ డైట్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రత్యేక అధికారులంతా నిరంతరం వసతి గృహాల్లో అమలవుతున్న కామన్ డైట్ విధానాన్ని పర్యవేక్షించాలని తెలిపారు. ఆ తర్వాత ఇటీవలే జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి అభినందించారు. మున్ముందు జిల్లా ఖ్యాతిని మరింత చాటాలని ఆకాంక్షించారు. అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో అవార్డు సాధించడానికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపి అవార్డు స్వీకరణ సందర్భంగా కలిగిన అనుభవాలను అధికారులతో పంచుకున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.