T20 World Cup 2024: ఉగాండా(Uganda), అఫ్గానిస్తాన్(Afghanistan) మధ్య జరిగిన టీ 20 వరల్డ్ కప్ అయిదో మ్యాచ్‌లో అఫ్గాన్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ బ్యాటర్లు ఉగాండా బౌలర్లపై సిక్సులు, ఫోర్లతో దంచికొట్టారు. అఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ 154 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు.
గుర్బాజ్ నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లతో 76 పరుగులు చేయగా.. ఇబ్రహీం జద్రాన్ 70 పరుగులు చేశారు. దీంతో 14.3 ఓవర్లకే 154 పరుగులు చేసింది. కాగా ఉగాండా బౌలర్లు చివరి అయిదు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 186 పరుగులకే అఫ్గాన్ టీంను పరిమితం చేశారు. ఉగాండా బౌలర్లలో మసాబా రెండు వికెట్లు తీయగా.. కోస్కుయ్ కేవుట్ల 2 వికెట్లు తీశారు.
187 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఉగాండా బ్యాటర్లను అప్గానిస్తాన్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించారు. ఫజుల్ ఫరూకీ (Farooqi) నాలుగు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అఫ్గాన్ తరఫున టీ 20లో బెస్ట్ బౌలింగ్ ఫర్పామెన్స్ రికార్డును తన పేరున ఫజూల్ ఫరూకీ లిఖించుకున్నాడు. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఉగాండా అత్యంత చెత్త రికార్డు మూట గట్టుకునేలా కనిపించింది.
ఉగాండా టీంలో ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చివరకు 58 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఓటమి మూటగట్టుకుంది. అయితే రాబోయే మ్యాచుల్లో పెద్ద జట్లతో ఆడాల్సి ఉండటంతో మరింత మెరుగ్గా ఆడితేనే పరువు నిలబెట్టుకోగలదు. లేకపోతే అత్యల్ప స్కోరు నమోదు చేసుకుని అప్రతిష్ట మూట గట్టుకోవాల్సి వస్తుంది.