- వర్షం కోసం రైతన్న ఎదురుచూపులు
- ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షాల్లేవ్
- నైరుతి రుతుపవనాలు వచ్చినా చిరుజల్లులే
- విత్తు విత్తేదెప్పుడా అని అన్నదాతల ఆవేదన
- అదును దాటుతోందని ఆందోళన
Farmers waiting for rain: వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్నా చినుకుజాడలేదు. ఈ ఏడు ముందస్తు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఆనందించిన రైతుల ఆశలు నిరాశగానే మిగిలాయి. విత్తు విత్తేందుకు అనువైన సమయం కోసం రైతులు ఎదురు చూస్తు్న్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా ఆశించిన స్థాయిలో పడడంలేదు. ఒక చోట కురిస్తే మరో చోట ఆకాశం నిర్మలంగా ఉంటోంది. విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప భూములు పంటలు పండిచేందుకు అనువుగా ఉండదు. తొందరపడి విత్తితే అనుకున్న సమయానికి వర్షాలు పడకపోతే నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. వానకాలం ప్రారంభమైనా.. నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినా.. ఆకాశంలో మేఘాలు రోజూ దట్టంగా కమ్ముకుంటున్నా వాన జాడ మాత్రం కానరావడం లేదు.
వర్షం కోసం ఎదురుచూపులు
మృగశిరకార్తెకు ముందు పలు చోట్ల చిరుజల్లులు కురిసినా మళ్లీ చినుకు జాడలేకుండా పోయింది. తొలకరితో పులకరించినా ఆ ఆనందం కంటిన్యూ కాలేదు. అప్పుడప్పుడు తప్పా చెప్పుకోదగ్గ వర్షాలే కురిసిందిలేదు. దీంతో అన్నదాతలు సందిగ్ధంలో పడ్డారు. విత్తనం వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేస్తే వర్షాలు కురిస్తే గట్టెక్కినట్లు లేదంటే వేసిన విత్తనాలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు గుబులు చెందుతున్నారు. ధైర్యం చేసి విత్తనాలు వేసినా సమృద్ధి వర్షాలు కురవకపోతే వేసిన విత్తనం భూమిలోనే మురిగిపోయి మొలకెత్తవు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని రైతులు ఆశగా ఆకాశంవైపు చూస్తున్నారు. వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడా, సాగుపనులు ఎప్పుడు ప్రారంభిద్దామని ఎదురుచూపులతో గడిపేస్తున్నారు.
భారమంతా వరుణుడిపైనే
మృగశిర కార్తె ప్రారంభంతోనే వ్యవసాయ పనుల్లో మునిగిపోవడం పరిపాటి. కానీ చిరుజల్లులే తప్ప భారీ వర్షాల జాడలేదు. దీంతో రైతులు ఎప్పుడూ మొగులు ముఖం పెట్టి చూస్తున్నారు. వరుణుడు కరుణిస్తే పొలం పనులు ముమ్మరం చేయొచ్చని ఆశతో ఉన్నారు. ఆకాశంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో భారీ వర్షం కురుస్తుందా అన్నట్లు వాతావరణం మారిపోతోంది. చిరుజల్లు కురిసి నేల తడిసేలోపే వర్షం ఆవిరవుతోంది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భారీ వర్షాలు కురిస్తే విత్తనం వేద్దామని ఎదురుచూస్తున్నారు.
విత్తుపై సందిగ్ధం
వర్షకాలం ప్రారంభానికి ముందే దుక్కి దున్నిన రైతులు విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక వర్షాలదే ఆలస్యం అనుకున్న తరుణంలో వరుణుడు ముఖం చాటేశాడు. తొలకరితో మురిసిపోయిన రైతు ఆనందం ఆవిరైపోయింది. వరితోపాటు పత్తి, పెసర, మినుము, కంది, మిర్చి వంటి ఆరుతడి పంటలు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం వర్షాలు లేక, కురిసినా విత్తన నిలిచేందుకు అవకాశం లేక రైతులు అదును కోసం ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజులు వర్షాల జాడ లేకపోతే అదును దాటిపోతోందని ఆందోళన చెందుతున్నారు.