Nominated posts
Nominated posts

Nominated posts: 25 కార్పొరేషన్ పదవుల భర్తీకి రంగం సిద్ధం

  • ఈ నెలలోనే ఫిలప్‌కు సీఎం రేవంత్ కసరత్తు
  • టీపీసీసీ చీఫ్ ఎంపికకూ లైన్ క్లియర్
  • పలు కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలకు ఛాన్స్
  • కులాల కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలు

Nominated posts: రెండో దఫా కార్పొరేషన్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొదటి విడతలో 36 కార్పొరేషన్ చైర్మన్లను నియమించారు. ఈ విడుతలో 25 చైర్మన్ పోస్టులను ఫిలప్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాగానే దీనిపై ఫోకస్ పెట్టనున్నారు.

రేవంత్ రాష్ర్టానికి రాగానే ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో సమావేశమై దీనిపై చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం. కార్పొరేషన్లతోపాటు పీసీసీ చీఫ్ నియామకంపైనా అధిష్టానంతో చర్చించే అవకాశముంది. ఈ నెలాఖరులోపే పదవులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. మొదటి విడుతలో పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు, పార్లీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలకు అవకాశం ఇచ్చారు. 36 కార్పొరేషన్లకు చైర్మన్లను ఫిలప్ చేశారు. ఫస్ట్ విడుతలో ఛాన్స్ దక్కనివారు రెండో విడుతలపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పుడు పిలుపొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క‌ృషి చేసిన వారికి గుర్తింపునిస్తామని ప్రతి సందర్భంలోనూ సీఎం రేవంత్, ఇతర పార్టీ ముఖ్యనేతలు చెబుతూ వస్తున్నారు. పదేళ్లు అధికారంలో లేకపోయినా పార్టీని వీడకుండా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టి న్యాయం చేయాలని అధిష్టానం భావిస్తోంది. మొదటి విడుతలో అవకాశం దక్కని వారు రెండో విడుతపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో రెండో విడుతలో పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండడంతో గట్టి పోటీ నెలకొంది.

గత నెలలోనే పోస్టులు ఫిలప్ చేస్తారనే ప్రచారం జరిగినా వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం రెండో దఫా ఫిలప్ చేసేందుకు కసరత్తు ప్రారంభం కావడంతో ఆశవహుల్లో ఉత్సాహం నెలకొంది. తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ సారి కొందరు ఎమ్మెల్యేలకు చైర్మన్ పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఆర్టీసీ, సివిల్ సప్లైస్, మూసీ రివర్ ఫ్రంట్ వంటి ముఖ్యమైన కార్పొరేషన్లను ఎమ్మెల్యేలతో భర్తీ చేసే అవకాశముంది. మంత్రి పదవులు దక్కని వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చి కూల్ చేసే ప్లాన్‌లో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

బేవరేజెస్‌ కార్పొరేషన్, వైద్య మౌలిక సదుపాయాల కల్పన, హ్యాండ్లూమ్స్, గీత కార్పొరేషన్‌ వంటి పోస్టులు ముఖ్యనేతలతో ఫిలప్ చేయనున్నారు. రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లను సైతం భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం వైశ్య కార్పొరేషన్‌కు మాత్రమే చైర్మన్‌ను నియమించారు. మిగతా కులాల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. పదవులు దక్కించుకునేందుకు నేతలు అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. లాబీయింగ్ నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *