- పేరుకుపోయిన చెత్త
- పారిశుధ్య కార్మికుల సమ్మె ఎఫెక్ట్
- పేరుకు పోయిన బకాయిలు
- విధులు బహిష్కరించిన కార్మికులు
Sanitation workers strike: నిర్మల్ పట్టణం నిర్మలత్వం కోల్పోయింది. పారిశుధ్య కార్మికులు విధులను బహిష్కరించడంతో పట్టణంలో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుపోయింది. దీంతో నిర్మల్ పట్టణం కంపు కొడుతుంది. అసలే నిర్మల్ పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి రోడ్లపై మురికి నీరు పారడం వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడుగా గత మూడు రోజులుగా పారిశుధ్య కార్మికులు సహాయ నిరాకరణ చేయడంతో పట్టణం చెత్తాచెదారంతో నిండిపోయింది. పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఓ పక్క విష జ్వరాలు విజృంభిస్తుండగా పట్టణంలో పారిశుధ్యం లోపించడం, కార్మికులు సమ్మెకు దిగడం అంటువ్యాధులకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది.
మూడు నెలల వేతనాలు బకాయి
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మూడు నెలల వేతనాలు బకాయి ఉండడం వల్ల కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో పట్టణంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించకపోవడం పట్ల పట్టణ ప్రజలు నిర్మల్ మున్సిపాలిటీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగర సుందరీకరణ పేరిట కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసిన మున్సిపల్ పాలకవర్గం కార్మికుల వేతనాలను చెల్లించకపోవడం అన్యాయమని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పారిశుధ్య కార్మికులకు మూడు నెలల వేతనాలను బకాయిలు పెట్టడం సమంజసం కాదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.
కోటిన్నర బకాయిలు
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కోటిన్నర రూపాయల వరకు వేతనాలు బకాయి ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 365 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుండగా ప్రతినెలా వారికి రూ.47 లక్షల వేతనాలు అవుతాయి. ఇలా మూడు నెలల వేతనాలు మొత్తం సుమారు కోటిన్నర వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం.
బకాయిలు చెల్లిస్తాం : మున్సిపల్ కమిషనర్
కార్మికులకు బకాయి ఉన్న వేతనాలను త్వరలోనే చెల్లిస్తామని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు అన్నారు. జూన్, జులై నెల వేతనాలు బకాయిలు ఉండగా పారిశుధ్య కార్మికులు ఆగస్టు నెల వేతనాలను చెల్లించాలని కోరుతున్నట్లు తెలిపారు. త్వరలోనే బకాయిలను చెల్లిస్తామని కార్మికులు విధులకు హాజరు కావాలని కోరారు.