- సల్కం చెరువును ఆక్రమించిన ఒవైసీ భవనాలకు నోటీసులెందుకు ఇవ్వడం లేదు?
- చెయ్యేస్తే సంగతి చూస్తానంటూ ఒవైసీ బెదిరిస్తే మౌనమెందుకు?
- చేతగాని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం
- హైడ్రా తీరు విస్మయం కలిగిస్తోంది
- నేత కార్మికుల కరెంటు బిల్లులకు సబ్సిడీ హామీని ఎందుకు అమలు చేయడం లేదు?
- సిరిసిల్ల విలీన గ్రామాల ప్రజల డిమాండ్‌కు బీజేపీ మద్దతు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay : అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందిన జన్వాడ ఫాంహౌజ్‌ను ఎందుకు కూల్చడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తమ భవనాలపై చెయ్యేస్తే ప్రభుత్వ అంతు చూస్తామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరిస్తే, ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇతర విద్యా సంస్థలకు నోటీసులిస్తూ కూల్చివేతలకు సిద్ధమవుతున్న హైడ్రా అధికారులు, అక్రమంగా నిర్మించిన ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులెందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. స్థానిక బీజేపీ నేతలను పరామర్శించేందుకు బండి సంజయ్ గురువారం సిరిసిల్లకు విచ్చేశారు. అనంతరం స్థానిక కార్యకర్తలతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని సురభి టీ సెంటర్‌లో చాయ్ తాగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సంజయ్ ఏమన్నారంటే… ‘సిరిసిల్లలో నేత కార్మికుల కరెంట్ బిల్లుల సబ్సిడీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. 50 శాతం సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేకపోయారు. మోసాల్లో ఒకరికొకరు మించిపోయారు. బిల్లులు తడిసి మోపడవుతున్నయ్. బిల్లులు కట్టడానికి ఆస్తులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. అసలే అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, లక్షల కొద్ది బిల్లులు వస్తుంటే కట్టేదేలా? ఇది చాలా సీరియస్ అంశం. ఇచ్చిన హామీ మేరకు నేతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. తిట్లు, విమర్శలను పక్కనపెట్టి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతున్నా. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా. నేతన్నలను ఆదుకోవడానికి కేంద్రం తరపున కృషి చేస్తా.’ అని అన్నారు.
హైడ్రా పేరుతో డ్రామాలు
‘చెరువులు, కుంటలను, సర్కార్ స్థలాలను కబ్జా చేసి ఫాంహౌజ్‌లు, విల్లాలు కడితే కూల్చివేయాల్సిందే. కానీ ఒకరిద్దరు పెద్దల భవనాలను కూల్చి, మిగిలినవన్నీ పేదల ఇండ్లను కూల్చేస్తాననడం సరికాదు. హైడ్రా తీరు విస్మయం కలిగిస్తోంది. చేతనైతే అక్రమాలకు పాల్పడుతున్న పెద్దోళ్లను కొట్టి పేదోళ్లను ఆదుకోండి. జన్వాడ ఫాంహౌజ్ ను ఎందుకు కూల్చడం లేదు? ఈ విషయంలో పోరాడిన రేవంత్ రెడ్డిని గతంలో జైల్లో వేశారు. ఆర్టీఐ ద్వారా అన్ని ఆధారాలు తెప్పించుకున్నారు. జన్వాడ ఫాంహౌజ్‌ను అక్రమంగా నిర్మించారని రేవంత్ రెడ్డే చెప్పారు. మరి ఎందుకు కూల్చడం లేదు? ఇంకా మీనమేషాలెందుకు? అంతేగాదు, సల్కం చెరువును కబ్జా చేసి విద్యా సంస్థలను నిర్మించిన అసదుద్దీన్ ఒవైసీ భవనాలను ఎందుకు కూల్చడం లేదు?
విద్యార్థులున్నందున గడువిస్తామని చెప్పిన హైడ్రా అధికారులు, ఇతర విద్యా సంస్థల భవనాలను కూల్చివేసేందుకు నోటీసులెందుకు ఇస్తున్నారు? ఒవైసీ సంస్థకో న్యాయం? ఇతరులకు ఇంకో న్యాయమా? మా భవనంపై చెయ్యి వేస్తే ప్రభుత్వ సంగతి చూస్తామని ఒవైసీ బెదిరిస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఇంతకంటే అసమర్థ, చేతగాని ప్రభుత్వం ఎక్కడా లేదు. మా ప్రభుత్వముంటే గుంజుకొచ్చి వాళ్ల సంగతి చెప్పేటోళ్లం. అదేమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఉందనుకుంటున్నారా? ఒవైసీ సంస్థకు నోటీసులెందుకు ఇవ్వరు? చర్యలెందుకు తీసుకోరు? మిగితా సంస్థల్లో చదివేవాళ్లు విద్యార్థులు కారా? ఒవైసీ సంస్థలో చదువుకునోళ్లే విద్యార్థులా? ప్రజలంతా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే, ప్రజల చర్చను పక్కదారి పట్టించుకునేందుకు హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతున్నరు.
రుణమాఫీపై సర్వే సిగ్గుచేటు
రుణమాఫీపై సర్వే చేస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటు. కొంపదీసి రుణమాఫీ పైసలన్నీ కర్నాటక మహర్షి వాల్మీకీ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ కు మళ్లించారా? ఏంది? రుణమాఫీ వివరాలన్నీ బ్యాంకులవద్ద రెడీగా ఉన్నాయి. ఇంకా సర్వే చేయడమేంది? ఇదో డ్రామా? కాలయాపన తప్ప. రైతులకు అప్పు మాఫీ కాక, భరోసా అందక, పంట నష్ట పరిహారం అందక అల్లాడుతుంటే సర్వేల పేరుతో డ్రామాలాడుతున్నరు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది. బీఆర్ఎస్ శిక్షణలో ఉన్నట్లున్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే పాలన చేస్తోంది. నిరుద్యోగులను చీలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చెప్పడం సిగ్గు చేటు. ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలి. నేను కోర్టును ధిక్కరించేలా ఎన్నడూ మాట్లాడలేదు.
కవిత తరపున బెయిల్ ఇఫ్పించేందుకు కాంగ్రెస్ నేత వాదించారని చెప్పిన. ఆయనకే కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్ ఇచ్చిందని చెప్పిన. నేను చెప్పినంక లాయర్ మారారు. దీనినిబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. రెండు పార్టీల మధ్య మాట ముచ్చట పూర్తయ్యింది. ఇక కలయికే తరువాయి. అందుకే కొందరు కాంగ్రెస్ నేతలు సింగపూర్ నుండి అమెరికా వెళ్లి, అక్కడ బీఆర్ఎస్ నేతలతో విలీనంపై చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సిరిసిల్ల విలీన గ్రామాల ప్రజల డిమాండ్ అమలు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి. విలీన గ్రామాల ప్రజల డిమాండ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతిస్తోంది. వాళ్ల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాల్సిందే. ఈ విషయంలో నా వంతు కృషి చేస్తాను.’ అని తెలిపారు.