Bitcoin
Bitcoin

Bitcoin: షాడో ఎక్కడా..?

  • బాబోయ్ బిట్ కాయిన్ -5
  • తప్పించుకు తిరగుతున్న పెద్ద సార్లు
  • కేసులో కనిపించని పురోగతి
  • ఎనిమిది మంది అరెస్టుతో సరి
  • నేతల ఎంట్రీతో చల్లబడ్డ కేసు
  • ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారా?

Bitcoin: నిర్మల్, సెప్టెంబరు 30 (మన బలగం): ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు:, గురుదేవో మహేశ్వర:..’ అని గురువుకు సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన గురువులు అత్యాశకు పోయి పక్కదార్లు ఎంచుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు విద్యాశాఖ కొందరు వ్యక్తుల వ్యవహార శైలితో వివాదాస్పదమవుతోంది. సమాజంలో మేధావి వర్గంగా గుర్తింపు ఉన్న ఉపాధ్యాయ లోకం కొందరి చేష్టల వల్ల చీత్కారాలకు గురవుతోంది. గతంలో బతకలేని బడిపంతులు అనేవారు. నేడు బతక నేర్చిన బడిపంతులు అనే స్థాయికి తీసుకువచ్చారు మన గురువులు. సమాజంలో గురువుల స్థానాన్ని దిగజార్చుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో మరికొందరు పెద్ద తలకాయలను వదిలేసినట్లు తెలుస్తోంది. అసలు సూత్రధారులు తప్పించుకు తిరుగుతుండడం విస్మయం కలిగిస్తోంది. కోట్ల రూపాయల వ్యాపారంలో షాడోగా ఉన్నదెవరు అనే కోణంలో ముందడుగు పడడంలేదు. కేసును లోతుగా విశ్లేషించకుండా నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిట్ కాయిన్ దందాలో సమాజంలో పలుకుబడి ఉన్నవారే కావడంతో కేసును నీరుగార్చేందుకు రాజకీయ ప్రముఖలు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్ల సమాచారం.

తప్పించుకు తిరుగుతున్న పెద్ద స్టార్లు

బిట్ కాయిన్ వ్యవహారంలో పాలుపంచుకున్న కొందరు ఉపాధ్యాయులు తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం అంతా ఇల్లీగల్ కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గొలుసుకట్టు వ్యాపారంలో అన్ని శాఖల ఉద్యోగులు ఉన్నప్పటికీ కేవలం విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనడం వల్ల ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టార్లుగా ఎదిగిన సార్లు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పాఠశాలలకు సెలవులు పెట్టుకొని అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో విద్యావ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయ్యింది.

కనిపించని పురోగతి

బిట్ కాయిన్ వ్యవహారం కేసులో పురోగతి కనిపించడం లేదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో పాలుపంచుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు సైతం పెట్టుబడులు పెట్టడంతో ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణ జరపడం లేదు. దీంతో కేసులో పురోగతి కనిపించడం లేదు. అధికారులు సిబ్బంది అందరూ ఈ వ్యవహారంతో సంబంధం ఉండడంతో పరిస్థితి ఏర్పడింది.

ఎనిమిది మంది అరెస్టుతో సరా

యు బిట్ కాయిన్ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు ఒక్కసారిగా చల్లబడ్డారు. ఒత్తిళ్లకు తలోగ్గారా అనే అనుమానాలకు దారితీస్తుంది. గత నెల రోజుల క్రితం ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు ఒక్కసారిగా మెత్తబడిపోవడంపై అన్ని వర్గాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జిల్లా ఎస్పీ బిట్‌కాయిన్ వ్యవహారంపై ఏఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపి ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న వారి పూర్తి వివరాలను సేకరించారు. మొదట ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు దూకుడు పెంచి మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అంతలోనే చల్లబడడం అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ పోలీసులు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని అనుకుంటే పెద్ద ముచ్చట ఏమీ కాదని పలువురు చర్చించుకుంటున్నారు.

నేతల ఎంట్రీ

బిట్ కాయిన్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచడంతో నాయకులు ఎంట్రీ ఇచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగులను రక్షించేందుకు నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలో జోరుగా సాగిన బిట్‌కాయిన్ వ్యాపారంలో ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు ఉన్నారు. వీరందరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో నాయకులు తలదూర్చినట్లు తెలుస్తోంది. అమాయక ప్రజలను నిండా ముంచిన వారిని ఉపేక్షించకూడదని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా అక్రమార్కులను అరెస్టు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు మద్దతుగా నిలవాల్సిన నాయకులు అక్రమార్కులకు అండగా నిలవడంపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారా?

బిట్ కాయిన్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారిని పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంతలోనే కేసు విచారణలో జాప్యం కావడంపై నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారా అనే అనుమానాలు అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. బిట్ కాయిన్ వ్యవహారంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉండడంతో నాయకుల చేత అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, నిర్మల్‌కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, ముధోల్ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అమాయక ప్రజలను నిండా ముంచిన వారిని రక్షించేందుకు నేతలు అధికారులపై ఒత్తిడి తేవడం మూర్ఖత్వమే అవుతుందని ప్రజలు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *