Minister Sitakka
Minister Sitakka

Minister Sitakka: అంగన్‌వాడీలు దేశానికి ఆదర్శంగా నిలవాలి

  • ఉన్నతాధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవాలి
  • క్షేత్రస్థాయి సందర్శనలు తప్పనిసరి
  • నాణ్యమైన విద్య బోధనలో రాజీపడొద్దు
  • ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు
  • బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

Minister Sitakka: మనబలగం, కరీంనగర్ బ్యూరో: అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యను నూతన సిలబస్ ప్రకారం బోధిస్తూ విజయం సాధిస్తున్న తెలంగాణ అంగన్వాడీలు దేశంలోనే ఆదర్శ అంగన్వాడీలుగా నిలవాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. మానకొండూరులో జరిగిన పోషణ ఆరోగ్య జాతరకు హాజరైన మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) అనంతరం కరీంనగర్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మానకొండూరులో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతరకు చక్కటి ఆదరణ వచ్చిందని, రాష్ట్రంలోని అన్నిచోట్ల పోషణ ఆరోగ్య జాతరలు నిర్వహించాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రతి వారంలో 2-3 రోజులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని అన్నారు.

అమ్మ మాట – అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు ముందున్నాయని తెలిపారు. పిల్లలంతా అంగన్వాడీలకు వచ్చేలాగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీలో అధునాతన సిలబస్ కూడిన విద్యతోపాటు నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అంగన్వాడి టీచర్లు అధునాతన బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు. వయోవృద్ధుల ఆశ్రమాల్లో పనిచేస్తున్న వార్డెన్ లో తల్లిలాగా వృద్ధులను ఆదరించాలని అన్నారు. పిల్లల పట్ల ఎలాంటి ప్రేమ చూపుతామో వృద్ధుల పట్ల అలాగే ప్రవర్తించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించిన పిల్లలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. పిల్లలు ఆదరించని తల్లిదండ్రులు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దివ్యాంగుల పిల్లల పట్ల ఆశ్రమ పాఠశాలల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడొద్దని అన్నారు. సమయం ప్రకారం అంగన్వాడీల్లో పిల్లల ఎత్తులు, బరువులు తూచాలని, బరువు తక్కువ ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని, కల్తీ సరుకులు పంపిణీ చేసినా, నాణ్యత కోరవడినా కాంట్రాక్టర్ల అనుమతులు వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అంగన్వాడీ కేంద్రాలను విరివిగా సందర్శించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఉన్నతాధికారులు అంగన్వాడి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అమలు చేసిన అంగన్వాడీ కేంద్రాల పెయింటింగ్స్, అంగన్వాడీలో నూతన ప్రాథమిక విద్యా విధానం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు

తెలంగాణలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా నిలవాలని ఆ దిశగా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల అంశం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయించాలని, స్థానిక ప్రజాప్రతినిధులు వీటిని పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధి హామీ పనులు ఈసారి ఎక్కువ మొత్తంలో సాగాయని, మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో రైతు కూలీలు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులకు వచ్చారని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్తులకు ఉపయోగపడే పనులు మాత్రమే నిర్వర్తించాలని ఆదేశించారు. చెక్ డ్యాం, మట్టి రోడ్లు, కాలువల నిర్మాణం లాంటివి ఉపాధి హామీ ద్వారా చేయాలన్నారు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ఏ పనిని మొదలుపెట్టాలో నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండో తేదీ నాటికి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగుస్తున్నందున బతుకమ్మ పనులను ప్రారంభించాలని తెలిపారు. రెండో తేదీ నుండి గ్రామ పంచాయతీలలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయని అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

స్వచ్ఛతా హీ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందన కార్యక్రమం అక్టోబర్ 4-5 తేదీల్లో హైదరాబాదులో నిర్వహిస్తామన్నారు. ప్రతి అధికారి గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్లాస్టిక్ ని పూర్తిగా తగ్గించాలని సూచించారు. పచ్చదనం స్వచ్చదనం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్నారు. వాటర్ ట్యాంక్ లు 15 రోజులకోసారి తప్పనిసరిగా శుద్ధి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ కాంతి వెస్లీ, గ్రామీణభివృద్ధి కమిషనర్ అనిత రామచంద్రన్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్ జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Minister Sitakka
Minister Sitakka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *