Bitcoin
Bitcoin

Bitcoin: కుదేలవుతున్న రియల్ ఎస్టేట్

  • బాబోయ్ బిట్ కాయిన్-6
  • బిట్ కాయిన్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్బయటకురాని బాధితులు
  • కొనసాగుతున్న యాప్ డిపాజిట్లు
  • ఏజెంట్లకు ఆగని కమీషన్లు

Bitcoin: నిర్మల్, అక్టోబర్ 1 (మన బలగం): ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అధిక కమీషన్ల ఎర చూపించడంతో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులను విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టినవారు పూర్తిగా నష్టపోతుండగా, పెట్టించినవారు మాత్రం కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలను రాబట్టుకుంటున్నారు. ఇదీ నిర్మల్ జిల్లాలో బిట్‌కాయిన్ వ్యాపారంలో జరిగిన వ్యవహారం. జిల్లాలోని సొమ్మంతా విదేశీ కంపెనీలో డిపాజిట్లు చేయడంతో ఇక్కడి వ్యాపార వాణిజ్య లావాదేవీలు కుదలేయ్యాయి. రియలెస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నది.

రియల్ ఎస్టేట్‌కు బిట్‌కాయిన్ దెబ్బ

విదేశాలకు చెందిన బిట్‌కాయిన్ యాప్‌లో నిర్మల్ జిల్లా నుంచి వందల కోట్ల రూపాయలను పెట్టబడులుగా పెట్టడంతో జిల్లాలో రియల్ వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. డాలర్ మోజులో పడి లక్షల రూపాయలను డిపాజిట్లు చేయడంతో స్థానికంగా నిత్యం జరిగే అన్ని వ్యాపార రంగాలపై దీని ప్రభావం పడింది. ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు బిట్ కాయిన్ యాప్‌లో పెద్ద మొత్తంలో డబ్బులను డిపాజిట్లు చేశారు. భారీ ఎత్తున పెట్టుబడులు బిట్‌కాయిన్‌కు మళ్లడంతో స్థానిక వ్యాపారాలపై ప్రభావం పడుతోంది.

రూ.200 కోట్లకుపైగా వ్యాపారం

బిట్ కాయిన్ దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ప్రజలు తమ చేతిలో ఉన్న డబ్బు అంతా బిట్ కాయిన్ యాప్‌లో డిపాజిట్లు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో భూముల అమ్మకాలు కొనుగోలు జోరుగా సాగేవి. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్లకు పైగా విదేశీ కంపెనీలలో డిపాజిట్లు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక పక్క భూములకు ధరలు విపరీతంగా పెరిగిపోవడం ఒక కారణం కాగా ఉన్న డబ్బు అంతా బిట్‌కాయిన్ యాప్‌లో ప్రజలు డిపాజిట్ చేయడం మరో కారణమని చర్చించుకుంటున్నారు.

బయటకు రాని బాధితులు

బిట్‌కాయిన్ యాప్‌లో ఏజెంట్ల మాటలు నమ్మి లక్షలాది రూపాయలు డిపాజిట్లు చేసిన అమాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బయటకు చెప్పుకోలేక, ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోలేక మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అధిక కమీషన్ల ఆశతో వడ్డీలకు తెచ్చి డిపాజిట్లు చేసిన వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. డిపాజిట్లు చేయించిన వారు మీ మీ డబ్బులు తిరిగి మీకు చెల్లిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు బాండ్ పేపర్లు, చెక్కులను ఇస్తూ వాయిదాలలో మీ సొమ్మును చెల్లిస్తామని, మీరు ఎక్కడికి వెళ్లకూడదని నమ్మిస్తున్నారు. ప్రజలు వీరి మాటలను నమ్మి బయటకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

కొనసాగుతున్న యాప్ డిపాజిట్లు

బిట్ కాయిన్ యాప్ చట్టబద్ధమైనది కాదని తెలిసినప్పటికీ ప్రజలు నేటికీ డిపాజిట్ల రూపంలో డబ్బులను చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డబ్బులు డిపాజిట్ చేసిన వారికి కమీషన్లు సైతం రోజు వారి ఖాతాల్లో జమ అవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని అధికార యంత్రాంగం కొట్టిపారేస్తున్నప్పటికీ ఈ వ్యవహారం యథావిధిగానే కొనసాగుతోంది. ఈ యాప్ ద్వారా డిపాజిట్లు చేయించిన కొందరు అరెస్టు కాగా వారి కింద నమోదు చేసుకున్న బంధువులు, అనుచరుల ఖాతాల్లో నేటికీ డబ్బులు జమవుతున్నట్లు సమాచారం. విదేశాలకు చెందిన యాప్ కావడంతో ఇక్కడి పోలీసు యంత్రాంగం వారిని సమూలంగా నియంత్రించలేక పోతోంది. తద్వారా ఈ వ్యవహారం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకెంత మంది బలవుతారో వేచి చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *