Digital Family Survey: నిర్మల్, అక్టోబర్ 4 (మన బలగం): డిజిటల్ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మల్ పట్టణం 42వ వార్డు(చింతకుంట వాడ)లో శుక్రవారం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు. ముందుగా ఇంటింటి సర్వేను ఎన్ని బృందాలతో చేపడుతున్నారని, సర్వే నమోదులో ఏమైనా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా అని సర్వే సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కుటుంబాల ఆధారంగా సర్వే జరుగుతోందని, కొత్త కుటుంబాల వివరాలను ఆధార్ కార్డు ద్వారా నమోదు చేస్తున్నట్లు సర్వే బృందం కలెక్టర్కు వివరించారు. కుటుంబంలో పెద్ద వయసు కలిగిన మహిళా ఉంటే ఆమె పేరునే ప్రామాణికంగా తీసుకోవాలని, ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయాలని బృందాన్ని ఆదేశించారు. పైలెట్ కింద ఎంపికైన గ్రామలు, వార్డులో ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సుభాష్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.