- మహిషాసుర వధలో పాల్గొన్న సంజయ్
- హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి
- దాండియా కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ జాతీయ నాయకులు అభయ్ పాటిల్ హాజరు
Bandi Sanjay: మనబలగం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 11 రోజులుగా చేపట్టిన భవానీ దీక్ష శుక్రవారంతో ముగిసింది. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన రుద్ర సహిత చండీ యాగం అనంతరం బండి సంజయ్ దీక్షను విరమించారు. అనంతరం సాయంత్రం ఆలయ ఆవరణలో నిర్వహించిన మహిషాసుర వధ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా నిప్పు అంటించి మహిషాసురుడిని అగ్నికి అహుతి చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ విజయదశమి పర్వదినం సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో శనివారం దసరా సందర్భంగా నిర్వహించే షమీ పూజ సహా పలు కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. పవిత్రమైన విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘చెడుపై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి. చెడు ఆలోచనలను వీడి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో నిత్య జీవితం గడపాలి. అలాంటి వారు కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారిని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ నాయకులు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ రాష్ట్ర ఇంఛార్జ్ అభయ్ పాటిల్ శుక్రవారం కరీంనగర్ విచ్చేసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అభయ్ పాటిల్ కు పూర్ణ కుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ తో కొద్దిసేపు ముచ్చటించారు. దాండియా కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాశక్తి ఆలయానికి రానున్నారు.