Dharani pending applications: నిర్మల్, అక్టోబర్ 17 (మన బలగం): పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల్లో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న జిల్లా ప్రజావాణి, సీఎం ప్రజావాణి, పౌర సేవల గుర్తింపు పత్రాలకు సంబంధించిన వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కరించిన తర్వాత దరఖాస్తుదారులు పరిష్కారానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలన్నారు.
ఒకవేళ దరఖాస్తును రిజెక్ట్ చేసినట్టయితే దానికి సంబంధించిన కారణాలను రిమార్కుల విభాగంలో పొందుపరచాలాన్నారు. వివాదాస్పద అంశాలతో కూడుకున్న భూ సమస్యల పరిష్కార విషయంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యను పారదర్శకంగా పరిష్కరించాలని తెలిపారు. ప్రజలకు అందించే పౌర సేవల గుర్తింపు పాత్రల జారీలో ఆలస్యం చేయకూడన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముభాకరక్ దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించాలన్నారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. తహసీల్దార్లు వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్ఓ భుజంగ్ రావ్, సీపీఓ జీవరత్నం, అన్ని మండలాల తహశీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.