Police Flag Day
Police Flag Day

Police Flag Day : శాంతియుత సమాజ నిర్మాణమే పోలీసుల లక్ష్యం.. జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్

Police Flag Day : జగిత్యాల, అక్టోబర్ 21 (మన బలగం): శాంతియుత సమాజ నిర్మాణమే పోలీసుల లక్ష్యమని, ఆ దిశలో విధులు నిర్వర్తిస్తూ ఎందరో పోలీసులు అమరులయ్యారని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డేను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనం.

ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, పోలీస్ శాఖ వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా సమాజంలో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తూ, సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో, సేవాతత్పరతతో పని చేస్తుందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. అమరవీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31వ వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహణ ఉంటుందన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు, నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, సాంకేతిక వినియోగం, ప్రజారక్షణలో పోలీసుల సేవలు, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మొదలైన విషయాలను స్కూల్ పిల్లలకు తెలియజేయడం జరుగుతుందన్నారు.

విద్యార్థులకు ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫొటోగ్రఫీ, రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అసాంఘిక శక్తులతో పోరాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి పేరు పేరునా నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ మనం ఈ సొసైటీలో శాంతియుతంగా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి కారకులైనటువంటి బోర్డర్స్‌లో పనిచేస్తున్న సైనికులు గాని, సొసైటీలో 24 గంటల పనిచేస్తున్న పోలీసు వారే కారణమన్నారు. పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు.

అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇది అభినందనీయమని కలెక్టర్ అన్నారు. విధినిర్వహణలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తూనే వారికి ఎల్లప్పుడూ సపోర్టుగా పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో, నక్సల్స్ ఏరివేతలో భాగంగా జిల్లాలో అసువులు బాసిన వారిని మరోసారి గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పిలు రవీంద్ర కుమార్, రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు, రంగా రెడ్డి, డిసిఆర్బి, సిసిఎస్, ఐటి కోర్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రఫీక్ ఖాన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్ కుమార్ రామకృష్ణ, వేణు, సి.ఐలు వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి, రవి, నిరంజన్ రెడ్డి, సురేశ్, ఎస్.ఐలు, పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *