pottel movie review: పొట్టేల్.. టైటిల్‌కు తగ్గట్లే సినిమా ఆద్యంతం పొట్టేల్ చుట్టే తిరుగుతుంది. ఆ ఊరిలో ప్రతి సంవత్సరం జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గ్రామ దేవతకు పొట్టేల్‌ను బలిస్తారు. అయితే జాతర జరిగే సమయంలో పొట్టేల్ చనిపోతుంది. వరుసగా రెండేండ్లు ఇలా జరుగుతుంది. ఆ సంవత్సరమే గ్రామంలో కరువు విలయతాండవం చేస్తుంది. గ్రామదేవత ఆగ్రహించడంతోనే కరువు వచ్చిందని గ్రామస్తులు భావిస్తారు. వచ్చే సంవత్సరం ఇలా జరగకుండా పొట్టేల్‌ను సంరక్షించే బాధ్యత గంగాధరీ (యువచంద్రకృష్ణ) తీసుకుంటాడు. మూడో సంవత్సరం అనుకున్నట్లుగానే పొట్టేల్‌ను గ్రామ దేవతకు బలిచ్చారా లేదా అన్నదే మిస్టరీ.
దర్శకుడు సాహిత్ మోత్కూరి తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది. కథ కథనం ఆకట్టుకుంటుంది. పొట్టేల్ గురించి చెప్పిన విధానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి అరగంట పాటు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆ తరువాత కథనంలో బిగువు సడలినట్లు అనిపిస్తుంది. పొట్టేల్ మూవీలో అనేక అంశాలు మేళవించారు. ప్రజల బలహీనతలు, మూడనమ్మకాలను చక్కగా చూపించారు. చదువు రాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే లైన్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు. పొట్టేల్ కథ అంతా చదువు చుట్టే నడుస్తుంది. కూతురును చదివించాలన్న తండ్రి తపన బాగా ఎలివేట్ అయ్యింది. పలు అంశాలను ఒకే సారి టచ్ చేయడంతో కథనం లోపించినట్లు అనిపిస్తుంది. ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేయాలనుకున్న అంశంలో కాస్త తడబడ్డట్లు తెలుస్తోంది. ట్రైలర్, పబ్లిసిటీ స్థాయిలో సినిమాను చూపించడంలో కాస్త వెనుకబడ్డట్లు కనిపిస్తుంది. బీజీఎం పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేదు. ఎమోషనల్ సీన్స్‌లో బీజీఎం ఫర్ఫెక్ట్‌నెస్ లోపించింది.
నటీనటుల విషయానికి వస్తే ప్రధాన పాత్ర పోషించిన యువ చంద్ర కృష్ణ ఫర్వాలేదనిపించారు. అనన్య నాగళ్ల పాత్ర కొద్దిమేరకే పరిమితమైంది. అయినా తన పరిధి మేరకు బాగా నటించారు. అజయ్‌కి ఈ మూవీలో మంచి పాత్ర లభించింది. నోయెల్ కొద్దిసేపే కనిపించినా ఫర్వాలేదనిపించాడు. 1970-80 పరిధిలో జరిగిన కథనానికి సెట్టింగ్స్ బాగా కుదిరాయి.