Training on comprehensive survey: నిర్మల్, అక్టోబర్ 30 (మన బలగం): సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అంశాలపై ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహణపై అధికారులకు నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి 150 గృహాలకు ఒక ఎన్యుమరేషన్ బ్లాకుగా పరిగణించాలన్నారు. ప్రతి ఎన్యుమరేషన్ బ్లాకుకు ఒక ఎన్యుమరేటర్ అధికారి బాధ్యుడిగా ఉంటారని, కేటాయించిన ఎన్యుమరేషన్ బ్లాక్ లోని ప్రతి కుటుంబానికి సంబంధించి నిర్దేశించిన అన్ని వివరాలను సేకరించాలని ఆదేశించారు.
సేకరించిన అన్ని వివరాలు ఖచ్చితత్వంతో ఉండాలన్నారు. ప్రతి అధికారి సమయానికి తమకు కేటాయించిన ప్రదేశానికి చేరుకొని సర్వేను ప్రారంభించాలన్నారు. సర్వే నిర్వహించిన ప్రతి ఇంటికి సర్వే పూర్తయినట్లుగా తెలిపే స్టిక్కర్ ను అతికించాలన్నారు. సర్వే వివరాల డాటాను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు. సూపర్వైజర్లు ఎన్యుమరేటర్ అధికారి నిర్వహించిన సర్వేలోని 10 శాతం వివరాలను ర్యాండంగా తనిఖీ చేయాలని, సర్వే సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా పైఅధికారులకు సమాచారం తెలియజేయాలనీ సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు అధికారులకు శిక్షణను ఇచ్చి సర్వేకు సంబంధించి వివరాల నమోదులో సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో గోవింద్, ట్రైనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీపీలు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.