Death of a student
Death of a student

Death of a student: విద్యార్థి మృతి.. బంధువుల ఆందోళన

Death of a student: నిర్మల్, నవంబర్ 5 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్ బండ్ సమీపంలోని మహాత్మ జ్యోతి బాఫూలే పాఠశాలలో విద్యార్థి మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఫయాజ్ హుస్సేన్(14) ప్రతిరోజు లాగానే ఉదయం బేస్ బాల్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫయాజ్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతికి గల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాలుడి స్వగ్రామం దిలావర్‌పూర్ మండలం లోలం గ్రామం.

బంధువుల ఆందోళన

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందున్న జాతీయ రహదారిపై మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జ్యోతిబాఫూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఫయాజ్ మృతికి పాఠశాల సిబ్బంది కారణమని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్, పాఠశాల సిబ్బంది వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని బైఠాయించారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆర్డీవో రత్న కళ్యాణి, డీఈవో రవీందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మృతుని కుటుంబానికి న్యాయం చేయండి:శ్రీహరి రావు

విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించారు. బాధితునికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *