- సర్వే విజయవంతానికి ప్రజలంతా సహకరించాలి
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
house survey: నిర్మల్, నవంబర్ 5 (మన బలగం): సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వేను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సర్వే నిర్వహణకు 637 మంది ఎస్జీటీలతో సహా మొత్తం 1914 మంది ఎన్యుమరేటర్లతో కూడిన బృందాలు 396 గ్రామ పంచాయితీల ఆవాసాలలోని ప్రతి ఇంటిని సర్వే చేయడం జరుగుతుందని అన్నారు. 1812 ఎన్యుమరేషన్ బ్లాకుల్లో సర్వేను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు నిర్వహించిన సర్వే వివరాలను పరిశీలించడానికి 191 మంది సూపర్వైజర్లను నియమించినట్లు పేర్కొన్నారు. సర్వేలో భాగంగా ప్రజలందరి నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు సర్వేకు సంబంధించి హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టి, ఆ వెంటనే 15 నుంచి 17 రోజుల వ్యవధిలో సమగ్ర ఇంటింటి సర్వేను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసమై ప్రజలంతా తమ ఆధార్, రేషన్, పట్టా పాస్ బుక్ తదితర గుర్తింపు పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఇంటి యజమాని అందుబాటులో లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు గుర్తింపు పత్రాలను సర్వే బృందానికి సమర్పించవచ్చని తెలిపారు. సమగ్ర సర్వేపై పూర్తి వివరాలకు తాహసిల్దార్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని ప్రజలంతా సమగ్ర ఇంటింటి సర్వేకు పూర్తి సహాయ సహకారాలు అందించి సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.