Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 6 (మన బలగం): ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో కూడిన సమాచారాన్ని అందించాలని సూచించారు. మామడ మండలం న్యూ సాంగ్విలో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఇళ్లను సందర్శించి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అతికించిన స్టిక్కర్లను చూసి, వాటిపై నమోదు చేసిన ఇంటి నెంబరు, ఎన్యూమరేషన్ బ్లాక్, క్రమ సంఖ్య తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటి సర్వే కోసం ఏ ఒక్క నివాస గృహం సైతం మినహాయించబడకుండా ఎన్యూమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని రికార్డుల ఆధారంగా ఎన్యూమరేషన్ బ్లాక్‌లను గుర్తించామన్నారు. ఒక్కో బ్లాక్‌కు ఒకరు చొప్పున ఎన్యూమరేటర్లను నియమించామని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే నిర్వహించాల్సిన తీరుపై వారికి శిక్షణ తరగతుల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఈ నెల 6, 7, 8, తేదీలలో మూడు రోజుల పాటు హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 9వ తేదీ నుంచి సమగ్ర కుటుంబ వివరాల సేకరణ ప్రారంభమవుతుందని వివరించారు. సర్వే బృందానికి నిర్ణీత సమాచారాన్ని అందజేస్తూ, జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతానికి అన్ని వర్గాల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.