Jal Shakti Abhiyan: నిర్మల్, నవంబర్ 15 (మన బలగం): భూగర్భ జలాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిత తెలిపారు. నారీ శక్తిసే జల్ శక్తి కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారం జిల్లాలో వివిధ గ్రామాల్లో సాంకేతిక అధికారి సుశాంత్ కుమార్‌తో కలిసి పర్యటించి భూగర్భ జలాల సంరక్షణకు చేపట్టిన చర్యలను పరిశీలించారు. నిన్న సోన్ మండలంలోని వివిధ గ్రామాలలో నీటి సంరక్షణ చేపట్టిన చర్యలను పరిశీలించారు. ఈ రోజు లక్ష్మణచందా మండలం చామన్‌పల్లి, పొట్టపల్లి గ్రామాలలో పర్యటించి, నీటి సంరక్షణ చర్యలు, మొక్కల పెంపకం, ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులు పరిశీలించి నీటి సంరక్షణకు చేపట్టిన చర్యలను ప్రశంసించారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో జిల్లా మెరుగైన స్థానంలో ఉండడం గొప్ప విషయం అని కొనియాడారు. అనంతరం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలో ప్రత్యేకమైన కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించి హస్తకళలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, మహిళా సంఘాల సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.