- రాజన్నను దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- పర్యటనకు పటిష్ట భద్రత
- ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
CM visit to Vemulawada today: మనబలగం, సిరిసిల్ల ప్రతినిధి: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సీఎం పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, ఇతర చర్యలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, బుధవారం వేములవాడ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని అన్నారు. ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాలకు సీఎం రేవంత్ చేరుకుంటారని, అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. వేములవాడ పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు.
వేములవాడలో 76 కోట్ల రూపాయలతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు, 235 కోట్ల రూపాయలతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు, 50 కోట్ల రూపాయలతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు, 45 కోట్ల రూపాయలతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు, 166 కోట్ల రూపాయలతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు, 35 కోట్ల రూపాయలతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. 52 కోట్ల రూపాయలతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, మూడు కోట్ల రూపాయలతో నిర్మించే డ్రైన్ పనులు మొదలగు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో 26 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్పీ భవనాన్ని, వేములవాడలో కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాలలో మరణించిన 17 మంది కుటుంబీకులకు 85 లక్షల పరిహారం, 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు పంపిణీ చేయనున్నారని పేర్కొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారని, సభ అనంతరం అతిథి గృహం వద్ద లంచ్ చేసి హెలికాప్టర్ ద్వారా తిరిగి బయలుదేరుతారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అందిస్తామని, అవి ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ భద్రత వ్యవస్థ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హెలీప్యాడ్, గెస్ట్ హౌస్, రాజన్న దేవాలయం, అభివృద్ధి పనుల శంకుస్థాపన జరిగే చోట సిబ్బంది తమకు కేటాయించిన విధులను పకడ్బందీగా జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. రాజన్న దేవాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించే ప్రత్యేక పూజలు, చెల్లించుకునే మొక్కులకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్‌లో పూర్తి సిబ్బందితో కూడిన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, బహిరంగ సభ వద్ద మెడికల్ క్యాంపు పెట్టాలని అన్నారు. సమీక్షలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, అదనపు ఎస్పీలు చంద్రయ్య శేషాద్రిని రెడ్డి, సీఎంవో సెక్యూరిటీ సిబ్బంది, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.