Kodandaram: ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు సిఫారసు చేశారు. అప్పటి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ 2023 సెప్టెంబర్ 19వ తేదీన వీరి నియామకాన్ని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాలను అనుసరించి ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు గవర్నర్ ప్రకటించారు. దీన్ని వారు సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ పేర్లను ప్రకటించింది.
వీరి ఎంపికపై కోర్టులో కేసు వేయడంతో నియామకానికి బ్రేక్ పడింది. యథాతథ స్థితి స్టేటస్కో కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. కోదండరాం, అమీర్ ఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రావణ్, కర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులు వెలువరించారు. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకోవడమంటే గవ్నర్, ప్రభుత్వ హక్కులకు భంగం కలిగించినట్లేనని న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పుతో కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు.