27th package of Kaleshwaram project: నిర్మల్, నవంబర్ 26 (మన బలగం): కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీకి సంబంధించి భూసేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీలో భాగంగా భూసేకరణపై సంబంధిత నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీ పథకంలో భాగంగా భూసేకరణకు సంబంధించి సర్వేను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సర్వే నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వివరాలను ఆయా మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సంయుక్తంగా మండల స్థాయిలో రైతుల కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ రవీందర్, ఈఈ అనిల్, డిప్యూటీ ఈఈ నరేశ్ కుమార్, ఏఈఈలు మీరాజుద్దీన్, గంగాధర్, తహసీల్దార్లు ప్రవీణ్, శ్రీదేవి, రాజు, మల్లేశ్, అజిజ్ ఖాన్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.