Wadde Obanna Jayanti: నిర్మల్, జనవరి 11 (మన బలగం): నిర్మల్ కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో వడ్డే ఓబన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలను వేసి అంజలి ఘటించారు. వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సంపంగి ప్రభాకర్ మాట్లాడుతూ, పీడిత వర్గాల హక్కుల కొరకు పోరాడిన గొప్ప వ్యక్తి ఓబన్న అని తెలిపారు. వడ్డెర జాతి వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్నప్పుడు రేనాటి పాలెగాళ్లకు, కంపెనీ పాలెగాళ్లకు చెల్లించే జీతభత్యాల విషయంలో మొదలైన సంఘర్షణ సాయుధ పోరాటంగా మారడంలో ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయిధ పోరాటానికి వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షునిగా వ్యవహరించారన్నారు. ఇటువంటి పోరాట యోధుల జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం అని తెలిపారు. ఇటువంటి వ్యక్తుల జయంతులను అధికారికంగా నిర్వహించడం ద్వారా నేటి తరాలకు వారి పోరాట గాధల్ని తెలిపిన వారిమవుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి శ్రీనివాస్, సహాయ వెనుకబడిన తరగతుల అధికారి సత్యనారాయణ రెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు ఖాలిక్, ఇతర అధికారు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.