Constitution Day: నిర్మల్, నవంబర్ 26 (మన బలగం): రాజ్యాంగం సూచించిన విలువలను పాటిస్తూ సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులకు, ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగం అనేది ఆత్మ వంటిదని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు అనేవి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల కృషిని కొనియాడారు. ఆనాటి మేధావుల కృషితో మనకు పటిష్టమైన రాజ్యాంగం లభించిందన్నారు. అధికారులు, సిబ్బందితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అధికారులు, ప్రజలు రాజ్యాంగ విలువలు పాటిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీవో జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, మెప్మా పీడీ సుభాష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.