- ప్రయాణికుల భద్రతకే ‘మై ఆటో ఈజ్ సేఫ్’
- ఆటోలో సురక్షితంగా పోతున్నామన్న నమ్మకం తేవాలి
- పట్టణ పరిధిలో 1500 ఆటోలకు క్యూ ఆర్ కోడ్ లింక్
- ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
- జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Jagityala SP: జగిత్యాల, నవంబర్ 30 (మన బలగం): ప్రయాణికుల సురక్షిత, భద్రత ప్రయాణమే లక్ష్యంగా జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందని, అందుకే ప్రయాణికుల భద్రత కోసం ‘మై ఆటో ఈజ్ సేఫ్’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆటో రిక్షాల సర్వీసెస్ వాహన యాజమాన్యం నుంచి అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారాన్ని ఆటో ఈజ్ సేఫ్ యాప్ క్యూ ఆర్ కోడ్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ గ్రౌండ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో సుమారు 1500 ఆటోలకు (ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా) స్టిక్కరింగ్ చేయడం జరిగిందని, రాబోవు కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆటోకు ఈ స్టిక్కరింగ్ వేయడం జరుగుతుందన్నారు.
ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ‘మై ఆటో ఈజ్ సేఫ్’ అనే స్టిక్కరింగ్ ఉందా లేదా అని గమనించాలని అన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ మీతో అసభ్యంగా ప్రవర్తించినా, దురుసుగా మాట్లాడినా, మరే ఇతర సమస్యలు ఎదుర్కొన్నా మీరు ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ సీట్ వెనకాల ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే ఆటో డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్లో కనిపిస్తుందని, వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ ఉంటాయని తెలిపారు. ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుందన్నారు. వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం చేర వేయడంతో వెంటనే స్పందించి వాహనం లైవ్ లొకేషన్‌కు చేరుకుంటారని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ ‘మై ఆటో ఈజ్ సేఫ్’ స్టిక్కరింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ, ఆటో డ్రైవర్లకు అందించారు. ఎస్పీ స్వయంగా ఆటోలో కూర్చొని క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన అనంతరం వివరాలను తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించినా, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసినా ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు అన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ఎక్కించుకుంటే చర్యలు తీసుకుంటాం అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం నేరం అని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు పడితే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చెస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, ఆర్టీవో శ్రీనివాస్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, రూరల్ సీఐ కృష్ణ రెడ్డి, క్యూ ఆర్ కోడ్ యాప్ రూపకర్త రమేశ్ రెడ్డి, ఆర్ఐ వేణు, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఓనర్స్ పాల్గొన్నారు.