Awareness on CPR: జగిత్యాల, డిసెంబర్ 13 (మన బలగం): క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సీపీఆర్ (హృదయ శ్వాసకోశ పురర్జీవనచర్య)పై శిక్షణ ఉంటే కొంతమేర గుండె పోటు మరణాలను నియంత్రించే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఐఎంఏ హాలులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కార్డియా ఎటాక్‌తో కొందరు ఆకస్మిక మరణాన్ని పొందడం చాలా బాధాకరమన్నారు. ఇలా మరొకరు మరణించరాదన్న అనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన వచ్చినప్పుడే కార్డియా మరణాలు చాలా వరకు నియంత్రణలోకి వస్తాయన్నారు. ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన సందర్భాల్లో సీపీఆర్ విధానం ద్వారా గుండెకు రక్తప్రసరణ అందడం, నోటి ద్వారా ఆక్సిజన్ అందించడంతో గుండె పనిచేయడం తిరిగి ప్రారంభమై ప్రమాదానికి గురైనవారిని రక్షించవచ్చని తెలిపారు.
నిత్యం ప్రజల మధ్య ఉండే పోలీసులకు ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన వ్యక్తులు తారసపడే అవకాశం ఉన్నదందున, అన్నిస్థాయిలకు చెందిన పోలీసులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందినట్లయితే అలాంటి వ్యక్తుల ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సీపీఆర్ చేసే కాలాన్ని గోల్డెన్ హవర్గా భావించడం జరుగుతుందని అన్నారు. గుండెపోటు సంభవించినప్పుడు సీపీఆర్ చేయడంతో చాలా వరకు ప్రాణాని కాపాడవచ్చు అని అన్నారు. పోలీస్ సిబ్బందిలో ముఖ్యంగా ట్రాఫిక్ విధులు, బ్లూ కోట్, పెట్రో కార్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సీపీఆర్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని వైద్య శాఖ సహకారంతో విడతల వారీగా జిల్లాలో ఉన్న ఆటోడ్రైవర్లకు, హోటళ్లలో పనిచేసే సిబ్బందికి, పెట్రోల్ బంక్ లో పనిచేసే ఉద్యోగులకు సీపీఆర్‌తో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు ప్రథమ చికిత్సపై శిక్షణ ఇవ్వడం ద్వారా మరణాలు చాలా వరకు నియంత్రణలోనికి వస్తాయని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్, వైస్ ప్రిన్సిపాల్ మెడికల్ కాలేజ్ డాక్టర్ సునీల్, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్లు సుధీర్ కుమార్, నరేశ్, సంతోష్ రెడ్డి, హిమబిందు, స్రవంతి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రఫీక్ ఖాన్, నిరంజన్ రెడ్డి, వేణుగోపాల్, రామ్ నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, రవి, ఆర్ఐ వేణు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.