Louis Braille’s Jayanti: నిర్మల్, జనవరి 4 (మన బలగం): అంధుల జీవితాలలో లూయిస్ బ్రెయిలీ వెలుగులు నింపారని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం అంధుల లిపి సృష్టికర్త లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకలను సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లూయి బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు అంధులతో కలిసి అదనపు కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, అంధుల జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. లూయి బ్రెయిలీ బ్రెయిలీ లిపి కనుగొనడంతో అంధులు సైతం విద్య నేర్చుకోగలుగుతున్నారని తెలిపారు. ఆయన చేసిన కృషి వల్లనే అంధులు అనేక రంగాల్లో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. నేడు అంధులు విద్యను అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడుటకు బ్రెయిలీ లిపియే ముఖ్య కారణమని అన్నారు. అంధులు నిరాశ చెందకుండా, బ్రెయిలీ లిపిని నేర్చుకుని జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, ఎసిడిపిఓ నాగలక్ష్మి, సిడిపిఓ లు, అంధులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.