Dharmapuri Shri Lakshmi Narasimha Swamy: ధర్మపురి, డిసెంబర్ 17 (మన బలగం): ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున భక్తజనంతో కిటకిటలాడింది. సోమవారం వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాల నేపథ్యంలో భక్తజనం స్వామి వారి పూజాది కార్యక్రమాలు కనులారా తిలకించడానికి ఆలయానికి తరలివచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో నెలరోజుల పాటు కొనసాగే ధనుర్మాస పూజాది కార్యక్రమాలలో ఇదే తరహాలో భక్తజనం రద్దీ కొనసాగుతుంది. మొదటగా గోదావరి స్నానం ఆచరించి దేవాలయంలో దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. అర్చకులు, వేదపండితుల వేద పఠనం, మంగళ వాయిద్యాలు, అర్చకులు శ్రీ స్వామివారికి పంచోపనిషత్లతో అభిషేకం, స్వామివారికి నాగ, పంచ, కలశ పలు రకాల హారతులు, మంత్రపుష్పం, భజన కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించారు.