CPI Karimnagar: కరీంగనర్, డిసెంబర్ 20 (మన బలగం): భారత పార్లమెంటు(Parliament of India)లో అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీపీఐ (CPI) నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు ఖండించారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మతోన్మాద, మనువాద హోం మంత్రి అమిత్ షా వెంటనే ప్రజల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన హోం శాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంబేద్కర్( Ambedkar)ను అభిమానించే కోట్లాదిమంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీల మనోభావాలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, అవి ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంలో భాగమేనని ఆరోపించారు. గతంలో బీజేపీ(BJP) నాయకులు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పలు మార్లు పేర్కొన్నారని, ఇప్పుడు అదే రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు దానికి నిదర్శనం అన్నారు. అనగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌పై దాడి అంటే రాజ్యాంగంపైన దాడి అని ప్రతి ఒక్క పౌరుడు భావించాలన్నారు. వెంటనే బీజేపీ ప్రభుత్వం అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాతపై వ్యంగంగా మాట్లాడిన బీజేపీ నాయకుడు అమిత్ షా మనువాద ధోరణిని పార్లమెంటులో చూపించారని, వెంటనే ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు డిమాండ్ చేశారు.