- గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలి
- కబ్జాల కారణంగానే పలు ప్రాంతాల్లో వరద ముంపు
- నాలాలపై నిర్మాణాలతో రోడ్లపైకి వర్షపు నీరు
- ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
- బీజేపీ నేతల డిమాండ్
- అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం
- నిర్మల్‌లో పలు ప్రాంతాల్లో పర్యటన
BJP Nirmal: నిర్మల్ పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలు వెంటనే తొలగించి ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మినీ ట్యాంక్‌బండ్, కంచరోని చెరువు, తదితర ప్రాంతాల్లో ఆక్రమణలను పరిశీలించారు. చెరువుల్లో ఇండ్లు, కాంప్లెక్సులు నిర్మించడంతో చెరువులు కుచించుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు ఆక్రమించడంతో వర్షపు నీరు నిలిచే అవకాశం లేక సమీప ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. నాలాలు సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని, దీంతో వరద రోడ్లపై ప్రవహించి జనజీవనం స్తంబిస్తోందని తెలిపారు. ప్రతి వర్షకాలంలో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గొలుసుకట్టు చెరువులు ఆక్రమించడంతో భూగర్భజలాలు సైతం తగ్గిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హైదరాబాద్ తరహాలో హైడ్రా ఆధ్వర్యంలో నిర్మల్‌లోనూ ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఆక్రమణ దారులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, రాష్ర్ట నాయకుడు అయ్యన్నగారి భూమయ్య తదితరులు ఉన్నారు.