Prajavani: నిర్మల్, డిసెంబర్ 30 (మన బలగం): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు, రైతు రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
