ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా అమలు చేస్తాం
ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ భూమి పూజ
Adi Srinivas: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభంకానున్నదని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు వివరించారు. గతంలో ప్రజాపాలన సమయంలో పెట్టుకున్న దరఖాస్తులను ఈ నెల 21 నుంచి 24 వ తేదీ వరకు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని విప్ స్పష్టం చేశారు. జనవరి 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా కింద రూ.12 వేలు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమిలేని నిరుపేద కూలీలకు రూ.12 వేలు ఇస్తామని వెల్లడించారు.
నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇస్తూ, ప్రత్యేక కోటా కింద ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని విప్ స్పష్టం చేశారు. ప్రజాపాలన సమయంలో దరఖాస్తు చేయలేని వారు ప్రత్యేకంగా ఆయా ఆఫీసుల్లో దరఖాస్తు చేసి పోర్టల్‌లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. అధికారులు ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదన్నారు. గ్రామ, వార్డు సభల్లో అధికారులు ఓపిగ్గా ఉంటూ ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో కుల గణనను చేపట్టడం జరిగిందని విప్ చెప్పారు. రాబోవు రోజుల్లో పేద ప్రజలకు మేలైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతామని ప్రకటించారు. తాను కూడా 21 నుంచి నిర్వహించే సభల్లో పాల్గొంటానని తెలిపారు. మోడల్ హౌసును వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టి మన ప్రాంత ప్రజలకు నమూనాగా చూపెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జలి బేగం, మునిసిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, పి.డి.గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఎమ్మార్వో మహేశ్, ఎంపీడీవో ఎన్ మల్హోత్రా, హౌసింగ్ డిఈలు భాస్కర్, ముజఫర్, ఎంపీడీవోలు శ్రీనివాస్, ఎన్ మల్హోత్ర, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పాల్గొన్నారు.