- పంట నష్టపరిహారంపై నివేదికలు సిద్ధం చేయండి
- ప్రాజెక్టులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Nirmal heavy rains crop damage relief Jupally Krishna Rao Kadam project: నిర్మల్, ఆగస్టు 19 (మన బలగం): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలు ఆస్తి నష్టం జరిగిన బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టును ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోపై ఇంజినీరింగ్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఇప్పటికే 9 కోట్ల రూపాయల నిధులతో మరమ్మతు పనులు పూర్తిచేశామని వెల్లడించారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ వరదల కారణంగా పంట పొలాలు, నివాస గృహాలు, రహదారులు నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన అనంతరం సంబంధిత శాఖలు సర్వే చేసి, నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక పంపుతాయని, అనంతరం బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
వరద నీటిలో కొట్టుకుపోయిన ఒక మత్స్యకారుని కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి అన్నారు. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపడతామని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు సమాచారం అందించాలని, అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వాగులు, నదులు, ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్సి దండేవిట్టల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
