- ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో చదవాలి
- సమాజంలో గుర్తింపు పొందాలి
- పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
- కలెక్టర్ అభిలాష అభినవ్
collector Teaching lessons: నిర్మల్, జనవరి 23 (మన బలగం): నిర్మల్ జిల్లా కలెక్టర్ కాసేపు పంతులమ్మగా మారిపోయారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ పలు ప్రశ్నలు సంధించి ఉపాధ్యాయులకు సైతం చెమటలు పట్టించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో చదివి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం స్థానిక సోఫీనగర్ సమీపంలోని నిర్మల్ గ్రామీణం, సోన్ కేజీబీవీ పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహాకులకు కీలక సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని నిశిత పరిశీలన జరిపారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు, ఆహారం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రతిరోజూ భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన సరుకులు, నాసిరకం కూరగాయలను వినియోగించకూడదని, కోడిగుడ్ల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. నాసిరకమైన బియ్యం, వంట నూనె, ఇతర సరుకులు సరఫరా చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు.అనంతరం తరగతి గదిలో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మమేకమై వారికి అభ్యాసం, లక్ష్యాలు, సబ్జెక్ట్‌ల వారీగా పాఠాలు బోధించి సూచనలు చేసారు. విద్యార్థులు తమ పాఠాలను సమర్థవంతంగా చదవడం, సమయ పాలన పాటించడం ముఖ్యమని సూచించారు. భవిష్యత్తు లక్ష్యాలు స్పష్టంగా నిర్ణయించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. పరీక్షల సమయంలో ఆందోళన లేకుండా విశ్వాసంతో ఉండాలని ప్రోత్సహించారు. గణితం ప్రశ్నలను అడిగి విద్యార్థులతో బోర్డుపై జవాబులను రాయించారు. సబ్జెక్ట్‌ల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో కేజీబీవీల కోఆర్డినేటర్ సలోమి కరుణ, ప్రత్యేక అధికారులు సుజాత, లతాదేవి, తహసీల్దార్ రాజు, అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.