KCR ROAD SHOW AT JAGITYAL
KCR ROAD SHOW AT JAGITYAL

KCR:ఈ ప్రభుత్వానికి ఏం రోగం పట్టుకుంది

  • తెలంగాణ అగమైతే ఊరుకోను
  • ఐదెకరాలకే రైతు బంధు ఇస్తరట
  • ఆరేడు ఎకరాల రైతులు ఏం పాపం చేశారు
  • మహిళలకు రూ.2500 ఎంతమందికి ఇచ్చారు.
  • అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
  • బీజేపీతో దేశానికి ఒరిగిందేమీ లేదు
  • జగిత్యాల రోడ్‌షోలో కేసీఆర్

KCR: ‘‘మన ప్రభుత్వ హయాంలో అమలైన కేసీఆర్ కిట్టు నిలిపివేశారు.. బీడీ, చేనేత పింఛన్ రావడంలేదు.. సీఎంఆర్ఎఫ్, ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఆపేసిండ్రు.. ఎన్నో సంక్షేమ పథకాలు నిలిచిపొయినయ్.. ఈ ప్రభుత్వానికి ఏ రోగం పట్టుకుంది.. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి అభివృద్ధి కోసం పోరాడుతాం..’’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో జరిగిన రోడ్‌షోలో పేర్కొన్నారు.

– జగిత్యాల, మే 5 (మన బలగం)

కొట్లాది తెచ్చుకున్న తెలంగాణ చేతగాని కాంగ్రెస్ పాలకులతో ఆగమై పోతుంటే ఊరుకునేది లేదని, మరో పోరాటానికి సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఆదివారం రాత్రి జగిత్యాల పట్టణంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షో పాతబస్టాండ్ కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడారు. జగిత్యాల జిల్లా అవుతుందని ఏనాడూ అనుకోలేదని, మన హయాంలో జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లాను రద్దు చేస్తానని అంటున్నారని, దీన్ని మీరు ఒప్పుకుంటారా అని కేసీఆర్ సభికులను ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశామని, ఇక్కడ వైద్యపరంగా ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయక రాష్ట్రాన్ని ఆగం చేస్తోందన్నారు. వరద కాలువను వాడుకలోకి తెచ్చి రిజర్వాయర్‌గా మార్చి రైతులకు సాగు నిరందించామన్నారు. ఇప్పుడు వరద కాలువ ఎందుకు ఎండిపోయిందని కేసీఆర్ ప్రశ్నించారు. వరద కాలువలో నీరున్ననాడు రైతులతోపాటు మత్స్యకారులు చేపలను పట్టుకొని జీవించారని కేసీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నిర్మల్ సభలో మహిళలకు రెండువేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని ప్రకటించారని, జగిత్యాలలో ఎంతమందికి వస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు.

ఆరు గ్యారెంటీలు బూటకం
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు బూటకమన్నారు. రెండు లక్షల రుణమాఫీ అయిందా ప్రజలే చెప్పాలని కేసీఆర్ కోరారు. ఏ దేవుడి దగ్గరకు పోతే ఆ దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నారని, ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ఆరు ఏండ్లుగా అమలు చేశామని, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు చేతకావడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం ప్రజలకు చూపిన కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చి అభివృద్ధి కోసం నిర్మించుకున్న వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల గోస పట్టించుకునే కాంగ్రెస్ నాయకులు కారువయ్యారని, కరెంటు కోతలు, సాగునీటి, తాగునీటి కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రైతుబంధు కేవలం ఐదు ఎకరాల రైతులకే ఇస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నడని, ఆరు, ఏడు ఎకరాల రైతులు ఏమి పాపం చేశారో చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులను ఐదు వందల బోనస్ రాలేదని, కల్యాణ లక్ష్మీ పథకంలో తులం బంగారం జాడలేదన్నారు. మన ప్రభుత్వ హయాంలో అమలైన కేసీఆర్ కిట్టు నిలిపివేశారని, బీడీ, చేనేత, సీఎంఆర్ఎఫ్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, ఈ ప్రభుత్వానికి ఏ రోగం పట్టుకుందని కేసీఆర్ ప్రశ్నించారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ప్రజాలు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి అభివృద్ధికై పోరాడుతామని కేసీఆర్ ప్రజలను కోరారు.
సబ్‌కా సత్తెనాష్
పడేండ్లుగా ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను మోసాగిస్తూనే ఉన్నాడని, సబ్‌కా వికాస్ అంటూ.. సబ్‌కా సత్తెనాష్ చేస్తున్నాడని కేసీఆర్ అన్నారు. మోడీ ప్రతి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలను వేస్తామని చెప్పాడు జగిత్యాలలో ఎంతమందికి డబ్బులొచ్చాయోనని సభికులను ప్రశ్నించారు. గత లోకసభ ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారని నాలుగు రూపాలన్న తెచ్చారా అని కేసీఆర్ ప్రశ్నించారు. మనకున్న ఒక్క నది గోదావరిని మోడీ తమిళనాడుకు తరలించుకు పోతానని అంటుంటే ఒక్క బిజెపి ఎంపీ అడ్డుపడతలేదని చివరకు ముఖ్యమంత్రి రేవంత్ కూడా మాట్లాడడం లేదన్నారు.

దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక అన్నింటి ధరలూ అమాంతం పెరిగాయని, రూపాయి ధర అంతర్జాతీయ మార్కెట్లో ఘోరంగా పడిపోయిందని అన్నారు. బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, మన హక్కులు మనం సాధించుకోవడానికి బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని కేసీఆర్ కోరారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని, పెద్దపెల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ను, కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.
జగిత్యాల జనజాతర
కేసీఆర్ జగిత్యాలకు రాకతో పూర్తిగా గులాబీమయంగా మారింది. రోడ్ షోకు వేలాదిగా తరలిరాగా కొత్త బస్టాండ్, అంగడిబజార్, తహశీల్ చౌరస్తా మీదుగా సాగిన రోడ్ షోలో కేసీఆర్ కాన్వాయ్ వెంట వేలాదిగా జనం తరలివచ్చారు. పాతబస్టాండ్‌లో కిక్కిరిసిన జనసందోహాన్ని చూసి కేసీఆర్ తన ప్రసంగంతో సభికులను ఉత్తేజ పరిచారు. సీఎం, సీఎం అంటూ ప్రజలు కేసీఆర్ ప్రసంగానికి అడ్డుపడుతూ వచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రమణ, జడ్పీ చైర్మన్ వసంత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *