Congress dharna: నిర్మల్, ఫిబ్రవరి 3 (మన బలగం): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2025- 26 సంవత్సర ఆర్థిక బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉన్నా కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దెవ చేశారు. తెలంగాణ నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో సుమారు రూ.లక్ష వేల కోట్ల రూపాయిలు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.40 వేల కోట్లు తిరిగి ఇవ్వపోవడం బాధాకరం అని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.