Collector Sandeep Kumar Jha
Collector Sandeep Kumar Jha

Collector Sandeep Kumar Jha: జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 5 (మన బలగం): జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ, వివిధ అన్ని విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు, జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఫిబ్రవరి 10 నాడు అల్బెండజోల్ మాత్రలు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల ద్వారా ఫిబ్రవరి 10న ఇంటింటికీ వెళ్లి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలను వంద శాతం వేయాలని సూచించారు. ఒక వేళ ఈ రోజున మిస్ అయిన పిల్లలకు ఫిబ్రవరి 17న మాప్ ఆప్ డే నాడు తప్పక అందించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకరి చొప్పున అంగన్వాడీ సూపర్‌వైజర్లు, సీడీపీవోలు, మెప్మా సిబ్బంది పర్యవేక్షణాధికారులుగా విధులు నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిబ్బంది అందరూ భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు. ఈ మాత్రల వలన సైడ్ ఎఫ్ఫెక్టులు ఏమీ ఉండవని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి రజిత మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో అల్బెండజోల్ మాత్రలను 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి వేయాలని, గ్రామాల్లో పట్టణంలో ముందుగా చాటింపు చేయాలని సూచించారు. 1 నుంచి 2 సంవత్సరాల లోపు పిల్లలందరికీ సగం మాత్రను పొడి చేసి నీటితో కలిపి ఇవ్వాలని అన్నారు. 2 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక మాత్ర చొప్పున వేసి పూర్తిగా నమలమని చెప్పాలని, మాత్రలను ఇచ్చే సమయంలో తాగు నీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించినారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో లక్ష్మి రాజం, డీపీఆర్వో వి.శ్రీధర్, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేష్, జిల్లా విద్యా శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *