MLC Elections: నిర్మల్, ఫిబ్రవరి 24 (మన బలగం): ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 19,107 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇందులో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఓటరు అవగాహన పెంపొందించడానికి ఆర్డీవో కార్యాలయంలో నేడు, రేపు అవగాహన కేంద్రాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ సంఘాల వారికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు మాస్టర్ ట్రైనర్లచే రెండుసార్లు శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు మొత్తం 38 లక్షల 6 వేల 830 రూపాయల నగదు, 3 లక్షల 3 వేల రూపాయల విలువ గల 827 లీటర్ల మద్యాన్ని, 5 వేల 750 రూపాయల విలువ చేసే నిషేధిత మత్తు పదార్థాలను, పీడీఎస్ బియ్యం, గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్ రెడ్డి, సిరికొండ రమేశ్, గండ్రత్ రమేశ్, హైదర్, మజార్, జగన్ మోహన్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.